Kondareddy Burjuju: మెరిసిపోతున్న కొండారెడ్డి బురుజు.. పంద్రాగస్టు వేళ ప్రత్యేక అలంకరణ
- స్వాతంత్ర్య వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
- కర్నూలులో కొండారెడ్డి బురుజుకు విద్యుత్ దీపాలతో అలంకరణ
- మువ్వన్నెల రంగులతో మెరిసిపోతున్న బురుజు
స్వాతంత్ర్య వేడుకలకు దేశం సిద్ధమైంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తిరంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లాలో కొండారెడ్డి బురుజుకు ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పురావస్తు శాఖ అధికారులు కొండారెడ్డి బురుజును విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. దీంతో త్రివర్ణ పతాక రంగులతో కొండారెడ్డి బురుజు మెరిసిపోతోంది. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు నగర వాసులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
మరో పక్క స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏపీ సర్కార్ గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో గ్రామ పంచాయతీల్లోనూ ఘనంగా తిరంగా వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో ఈ వేడుకలకు అతితక్కువ మాత్రమే కేటాయింపులు ఉండగా, తాజాగా డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ గ్రామ పంచాయతీల్లో ఈ వేడుకల నిర్వహణకు రూ.10వేల నుంచి రూ.25వేల వరకూ కేటాయింపు చేశారు.