TPCC: టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని మరోసారి ప్రకటించిన ఎంపీ బలరాం నాయక్

MP Balram Naik announced once again that he is in the race for the post of TPCC president

  • టీపీసీసీ నూతన సారధి నియామకంపై పార్టీ అధిష్ఠానం కసరత్తు
  • ఈసారి ఎస్టీలకు అవకాశం కల్పించాలని కోరుతున్న ఎంపీ బలరాం నాయక్
  • బీసీ నేతల నుండి రేసులో పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, సురేష్ షెట్కార్  

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారధి నియామకానికి పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తున్న క్రమంలో మరోసారి తాను రేసులో ఉన్నట్లు మహబూబ్ నగర్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ప్రకటించారు. రేవంత్ రెడ్డి పదవీ కాలం కొన్ని రోజుల్లో ముగియనుండటంతో టీపీసీసీ నూతన చీఫ్ నియామకంపై పార్టీ అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. అయితే అధ్యక్ష పదవి రేసులో చాలా మంది నేతలు ఉండగా, సామాజిక వర్గ సమీకరణాలు కీలకం కానున్నాయి.
 
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ బీసీ కార్డును వాడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పీసీసీ పగ్గాలను బీసీ సామాజికవర్గానికి కేటాయించే ఆలోచన చేస్తోందని వార్తలు వినబడుతున్నాయి. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఎంపీ సురేష్ షెట్కార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయనే టాక్ ఉంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో ఎస్టీ జనాభా పది శాతంకు పైగా ఉన్న కారణంగా అధ్యక్ష పదవిని ఆ వర్గానికి కేటాయిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోందని అంటున్నారు. ఎస్టీ నేతల్లో చూసుకుంటే మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ లు ఈ పదవి రేసులో ఉన్నారు.
 
ఈ క్రమంలో తన మనసులో మాట మరోసారి బయటపెట్టారు ఎంపీ బలరాం నాయక్. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా, కేంద్ర సహాయ మంత్రిగా పని చేసిన అనుభవంతో పాటు పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నందు వల్ల తాను పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ప్రకటించారు బలరాం నాయక్. రాష్ట్రంలో 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గిరిజనులు అధికంగా ఉన్నారని ఆయన అన్నారు. వారంతా ముందు నుండీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారని తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇప్పటి వరకూ గిరిజనులకు అవకాశం దక్కలేదన్నారు. పార్టీ అధిష్ఠానం దృష్టికి ఈ విషయాన్ని తెలియజేసి తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News