HYDRA: చెరువుల ఆక్రమణలను అడ్డుకోవడానికే ‘హైడ్రా’: కమిషనర్ ఏవీ రంగనాథ్
- అక్రమ నిర్మాణాలు ఎవరివైనా సరే కూల్చేస్తామన్న ఏవీ రంగనాథ్
- ఇప్పటి వరకు 66 శాతం చెరువుల కబ్జా జరిగిందని వెల్లడి
- ఇలాగే వదిలేస్తే చెరువులే మిగలవని ఆందోళన
- రాజకీయ నేతలు, అధికారుల అండతో భూస్వాహా జరుగుతోందని వ్యాఖ్య
ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలు ఎవరివైనా సరే కూల్చివేయడం మాత్రం పక్కా అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్, ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని చెరువుల్లో ఇప్పటి వరకు దాదాపు 66 శాతం కబ్జాకు గురయ్యాయని, ఇలాగే వదిలేస్తే ఒకటి రెండేళ్లలో సిటీ పరిధిలో చెరువనేదే కనిపించకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రంగనాథ్ మాట్లాడుతూ.. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే కాదని చెప్పారు. సిటీని పకృతి విపత్తుల నుంచి రక్షించడానికి కృషి చేయడం, విపత్తుల సమయంలో వేగంగా స్పందించి ప్రజలను కాపాడే సంస్థ అని వివరించారు. ప్రభుత్వ భూములను స్థానికులతో కలిసి కాపాడుకోవడానికి తాము కృషి చేస్తామని తెలిపారు.
హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని రంగనాథ్ చెప్పారు. ఇప్పుడున్న చెరువులను కాపాడుతూ గతంలో కబ్జాకు గురైన చెరువులను నెమ్మదిగా స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. భూమికి ఉన్న విలువ కారణంగా రాజకీయ నేతల అండదండలు, కొంతమంది ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ భూములలో పేదలకు గుడిసెలు వేసి ఆవాసాలు ఏర్పాటు చేయడం, కొన్నాళ్ల తర్వాత వారికి డబ్బులిచ్చి ఖాళీ చేయించడం ఆపై ఆ భూమిని కబ్జా చేసి డెవలప్ చేయడం వంటివి జరుగుతున్నాయని వివరించారు. ఇలాంటి వాటిని సమర్థవంతంగా అడ్డుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి తమకు ప్రత్యేకంగా ఓ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే వాటి వెనక ఎవరున్నా సరే కూల్చివేత తప్పదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇలాంటి ఆక్రమించిన స్థలాలను కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచించారు. లేదంటే ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని తాము కూల్చివేస్తుంటే బాధపడాల్సి వస్తుందన్నారు. ఆక్రమించిన చెరువుల్లో నిర్మాణాలు చేపడితే వర్షాకాలం ఆ ఇళ్లు నీటమునుగుతాయని వివరించారు. అక్రమార్కులు సామాన్యులైనా, బడా నేతలైనా హైడ్రా లెక్కచేయదని స్పష్టం చేశారు. గతంలో కబ్జా పాలైన చెరువులను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టామని ఏవీ రంగనాథ్ చెప్పారు.