BCCI: 2024-25 సీజన్‌లో సొంతగడ్డపై టీమిండియా షెడ్యూల్‌లో మార్పులు

BCCI issues revised schedule for international home season 2024 and 2025

  • స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు, టీ20 సిరీస్.. ఇంగ్లండ్ తో వ‌న్డే, టీ20 సిరీస్ ఆడ‌నున్న టీమిండియా
  • తాజాగా బంగ్లాదేశ్, ఇంగ్లండ్ తో సిరీస్‌ మ్యాచ్‌లు జరిగే వేదికలను మార్చిన బీసీసీఐ
  • అక్టోబర్ 6న ధర్మశాలలో బంగ్లాతో జ‌ర‌గాల్సిన‌ మొదటి టీ20 గ్వాలియర్‌కు మార్పు
  • అలాగే ఇంగ్లండ్ తో జరిగే మొదటి, రెండో టీ20లకు కూడా వేదికలను మార్చిన‌ బోర్డు

భారత క్రికెట్ జట్టు సొంత గడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్టు, టీ20 సిరీస్, అలాగే ఇంగ్లాండ్‌తో వ‌న్డే, టీ20 సిరీస్ ఆడ‌నుంది. ఈ హోమ్ టూర్స్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గతంలోనే నిర్ణయించింది. అయితే, తాజాగా బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ సిరీస్‌ మ్యాచ్‌లు జరిగే వేదికలను బోర్డు మార్చింది. ఈ మేర‌కు బీసీసీఐ కొత్త షెడ్యూల్ ప్ర‌క‌టించింది. 
 
మొద‌ట బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. అక్టోబర్ 6న ధర్మశాలలో మొదటి టీ20 జ‌ర‌గాల్సి ఉండ‌గా.. ఈ వేదికను బీసీసీఐ తాజాగా గ్వాలియర్‌కు మార్చింది. అలాగే వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగే మొదటి, రెండో టీ20లకు కూడా వేదికలను మారుస్తున్నట్లు బోర్డు తెలిపింది.

హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ధర్మశాల స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్స్‌ రెనొవేషన్ చేయిస్తోంది. ఇంకా ప‌నులు పూర్తి కాలేదు. ఈ కార‌ణంతోనే భార‌త్‌, బంగ్లాదేశ్ మధ్య అక్టోబర్ 6న ఈ మైదానంలో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ను గ్వాలియర్‌కు మారుస్తున్నట్లు బీసీసీఐ త‌న‌ ప్రకటనలో పేర్కొంది.

గ్వాలియర్‌లోని ‘శ్రీమంత్ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం’లో మ్యాచ్‌ జరగనుంది. ఇదే స్టేడియంలో 2010లో ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డేలో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌ సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేశాడు. త‌ద్వారా వన్డేల్లో ఈ అరుదైన రికార్డు సృష్టించిన తొలి క్రికెటర్‌గా అవత‌రించాడు.

ఇక 2025 జనవరిలో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియాతో ఇంగ్లీష్ జ‌ట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. మొదటి టీ20 చెన్నైలో, రెండో మ్యాచ్‌ కోల్‌కతాలో జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఫస్ట్ టీ20 మ్యాచ్‌ వేదికను కోల్‌కతాకు, సెకండ్ టీ20ను చెన్నైకి మార్చారు. కానీ, మ్యాచ్‌లు జరిగే తేదీలను మాత్రం మార్చలేదు.

మొదటి టీ20 మ్యాచ్ 2025 జనవరి 22న, రెండోది జనవరి 25న జరగనున్నాయి. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం ఏర్పాట్ల కారణంగా మ్యాచ్‌కు భద్రత కల్పించడం ఇబ్బందిగా మారొచ్చని కోల్‌కతా పోలీసులు భావించారు. ఈ విషయాన్ని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్‌కు తెలపగా, మ్యాచ్ జరిగే వేదికను మార్చారు.

కాగా, బంగ్లాతో టెస్టు మ్యాచ్‌లు భార‌త కాల‌మానం ప్రకారం ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్రారంభం అవుతాయి. అలాగే టీ20 మ్యాచ్‌లు రాత్రి 7.00 గంట‌ల‌కు స్టార్ట్ అవుతాయి. ఇక ఇంగ్లాండ్‌తో వ‌న్డే మ్యాచ్‌లు మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు, టీ20లు రాత్రి 7.00 గంట‌ల‌కు మొద‌ల‌వుతాయి.  

భార‌త్‌ వర్సెస్ బంగ్లాదేశ్ మార్చిన‌ షెడ్యూల్ ఇదే..
మొదటి టెస్టు: సెప్టెంబర్ 19-23, చెన్నై
రెండో టెస్టు: సెప్టెంబర్ 27- అక్టోబర్ 1, కాన్పూర్
మొదటి టీ20: అక్టోబర్ 6, గ్వాలియర్
రెండో టీ20: అక్టోబర్ 9, ఢిల్లీ
మూడో టీ20: అక్టోబర్ 12, హైదరాబాద్

భార‌త్‌ వర్సెస్ ఇంగ్లాండ్ రివైజ్డ్ షెడ్యూల్ ఇలా..
మొదటి టీ20: జనవరి 22, కోల్‌కతా
రెండో టీ20: జనవరి 25, చెన్నై
మూడో టీ20: జనవరి 28, రాజ్‌కోట్
నాలుగో టీ20: జనవరి 31, పూణె
ఐదో టీ20: ఫిబ్రవరి 2, ముంబై
మొదటి వన్డే: ఫిబ్రవరి 6, నాగ్‌పూర్
రెండో వన్డే: ఫిబ్రవరి 9, కటక్
మూడో వన్డే: ఫిబ్రవరి 12, అహ్మదాబాద్

  • Loading...

More Telugu News