Vinesh Phogat: వినేశ్ ఫోగాట్ కు తీవ్ర నిరాశ... పిటిషన్ కొట్టివేసిన సీఏఎస్
- పారిస్ ఒలింపిక్స్ లో వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు
- 100 గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంగా అనర్హత
- సీఏఎస్ ను ఆశ్రయించిన వినేశ్ ఫోగాట్
పారిస్ ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 50 కిలోల కేటగిరీలో అనర్హత వేటుకు గురైన భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ కు సీఏఎస్ (కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్)లో తీవ్ర నిరాశ ఎదురైంది. వినేశ్ ఫోగాట్ దాఖలు చేసిన పిటిషన్ ను సీఏఎస్ కొట్టివేసింది.
వినేశ్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ 50 కిలోల కేటగిరీలో ఫైనల్ చేరింది. అయితే, నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందన్న కారణంతో ఆమెను ఫైనల్ కు అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో వినేశ్ కు పతకం (స్వర్ణం/రజతం) చేజారింది.
దీనిపై ఆమె సీఏఎస్ ను ఆశ్రయించింది. వినేశ్ తరఫున హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వాదనలు వినిపించారు. నిన్న ఈ కేసును ఆగస్టు 16కి వాయిదా వేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, సీఏఎస్ కాస్త ముందుగానే తీర్పు వెలువరించింది.
ఈ కేసులో వినేశ్ ఫోగాట్ కు అనుకూలంగా తీర్పు వచ్చి ఉంటే, ఆమెకు రజత పతకం దక్కేది. కానీ సీఏఎస్ ఆమె పిటిషన్ ను కొట్టివేయడంతో ఉత్తచేతులతో పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించినట్టయింది.