Chandrababu: కలెక్టర్లు అల్ రౌండర్లుగా తయారవ్వాలి: సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన చంద్రబాబు
- వివిధ వర్గాలతో ముఖాముఖి
- డీజిల్ ధరలు పెరగడంతో ఆదాయం తగ్గిందన్న ఓ ఆటోడ్రైవర్
- ఎలక్ట్రిక్ ఇంజిన్ గా మార్చుకోవాలని చంద్రబాబు సలహా
- వేదికపైకి కలెక్టర్ ను పిలిచి ఆటోడ్రైవర్ సమస్యను పరిష్కరించాలని సూచన
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్ పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన వివిధ వర్గాలతో ముఖాముఖి నిర్వహించారు.
ఓ ఆటోడ్రైవర్ వేదికపైకి వచ్చి... డీజిల్ ఖర్చులు పెరిగిపోతున్నాయని, వచ్చే ఆదాయం మిగలడంలేదని, దానికి సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
అందుకు చంద్రబాబు స్పందిస్తూ... "నీ ఆటో డీజిల్ ఇంజిన్ ను ఎలక్ట్రిక్ ఇంజిన్ గా మార్చేయ్... అప్పుడు ఇంధన ఖర్చు తగ్గుతుంది కదా... అలా మార్చొచ్చా... దానిపై నీకేమైనా అవగాహన ఉందా?" అని అడిగారు.
ఆ ఆటోడ్రైవర్ బదులిస్తూ... ఇంజిన్ మార్చడంపై తనకు అవగాహన లేదని, కానీ కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనాలంటే రూ.3 లక్షలు ఖర్చవుతుందని తెలిపాడు. సభలో కూర్చున్న కొందరు... ఆ ఇంజిన్ స్థానంలో ఎలక్ట్రిక్ ఇంజిన్ ను ఏర్పాటు చేయవచ్చు అని తెలిపారు. దాంతో చంద్రబాబు "కలెక్టర్" అని పిలిచారు. జిల్లా కలెక్టర్ వేదికపైకి రాగానే... "కలెక్టర్లు ఆల్ రౌండర్లుగా తయారవ్వాలి... ఇలాంటి విషయాల్లో కూడా పరిజ్ఞానం పెంచుకోవాలి" అని సూచించారు. దాంతో సభలో నవ్వులు విరబూశాయి.
"డీజిల్ ఇంజిన్ స్థానంలో ఎలక్ట్రిక్ ఇంజిన్ ఏర్పాటు చేసుకుంటే ఖర్చు తగ్గి, ఆదాయం పెరుగుతుంది. నేను మొట్టమొదటగా ఈ విధానాన్ని నీ ఆటోతోనే ప్రారంభిస్తా. దాన్ని నువ్వు ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకోవచ్చు. నువ్వొకసారి కలెక్టర్ ను కలువు... ఏం చేయాలో వారు దిశానిర్దేశం చేస్తారు... దాని ప్రకారం ముందుకెళదాం" అంటూ సీఎం చంద్రబాబు ఆ ఆటోడ్రైవర్ కు హామీ ఇచ్చారు.