Deshapathi Srinivas: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం
- సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం పెట్టాలనుకోవడాన్ని తప్పుబట్టిన ఎమ్మెల్సీ
- తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్
- లేదంటే బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరిక
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకుంటే... రేవంత్ రెడ్డి మాత్రం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వలసవాద పుత్రుడని... తెలంగాణ సోయి ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు. దేశ స్వాతంత్రానికి భరతమాత ప్రేరణ అయితే, తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ తల్లి ప్రేరణ అన్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో రేవంత్ రెడ్డి రైఫిల్ పట్టుకొని బయలుదేరాడని గుర్తు చేశారు. ఆయన సీఎం అయ్యాక జై తెలంగాణ నినాదం మసకబారిపోయి... జై సోనియమ్మ, జై కాంగ్రెస్ నినాదాలు తీసుకువచ్చారని విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రేవంత్ రెడ్డి తెలంగాణ స్వాభిమానం మీద దాడి చేస్తున్నారన్నారు. కాకతీయ తోరణం, చార్మినార్‌లను రాచరిక చిహ్నాలని గతంలో హేళన చేశారని మండిపడ్డారు.
అంబేడ్కర్‌కు నివాళిగా తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టామన్నారు. రాజ్యాంగం ద్వారానే తెలంగాణ ఏర్పడిందని, అందుకే గౌరవ సూచకంగా ఆయన పేరు పెట్టుకున్నట్లు చెప్పారు. సచివాలయంలో ఉండాల్సింది వ్యక్తుల విగ్రహం కాదని... తెలంగాణ తల్లి విగ్రహమన్నారు. కానీ అధిష్ఠానం మెప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటున్నారని ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ తల్లి విగ్రహం కావాలా? లేక రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కావాలా? తేల్చుకోవాలన్నారు.
తెలంగాణ బిడ్డ నాటి సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించారని విమర్శించారు. అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధమో చెప్పాలన్నారు. అసలు కనీసం సోనియా గాంధీకి అయినా తెలంగాణతో సంబంధం ఉందా? అని నిలదీశారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే ముందు మేధావులతో చర్చలు జరిపారా? అని ప్రశ్నించారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహమే పెట్టాలని నిర్ణయించుకుంటే బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించారు.