Rain: హైదరాబాద్లో భారీ వర్షం... మరో రెండు రోజులూ వర్షాలు
- నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం
- సెలవు రోజు కావడంతో బయటకు వచ్చిన నగర ప్రజలు
- వర్షం కురవడంతో తడిసిముద్దైన నగరవాసులు
- మరో గంటసేపు భారీ వర్షం కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
హైదరాబాద్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు సెలవు రోజు కావడంతో సాయంకాలం చాలామంది నగరవాసులు బయటకు వచ్చారు. ఈ సమయంలో వర్షం కురవడంతో తడిసిముద్దయ్యారు.
హైదరాబాద్లో ఈరోజు మరో గంటపాటు భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని నగరవాసులకు హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సూచించారు.
నగర పరిధిలో రానున్న రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు సాయంత్రం అత్యధికంగా ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంతంలో సుమారు 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, సనత్ నగర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దోమలగూడ, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి, షాపూర్ నగర్, జీడీమెట్ల, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతి నగర్, ఖైరతాబాద్, నాంపల్లి, కోఠి, తిరుమలగిరి, ప్యాట్నీ, బేగంపేట, చిలకలగూడ, మారేడ్పల్లి, మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, మలక్ పేట, చైతన్యపురి, ఎల్బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.