Chandrababu: చంద్రబాబు పేదల పథకాలు ఎత్తివేసి పప్పన్నం పెడుతున్నారు: మాజీ మంత్రి కాకాణి
- అన్న క్యాంటీన్లకు చంద్రబాబు ఫోటోలు, పచ్చ రంగులపై కాకాణి విమర్శలు
- ప్రజల విరాళాలతో నిర్వహిస్తున్న క్యాంటీన్లకు పచ్చ రంగులు వేయడం ఎంత వరకు సబబని ప్రశ్న
- సీనియర్ ఐపీఎస్ లను వేధించడం అనైతిక పాలనకు పరాకాష్ఠ అంటూ విమర్శ
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ లను అందుబాటులో తెస్తోంది. ఈ క్రమంలో తొలి విడతగా వంద క్యాంటీన్లను ఏర్పాటు చేయగా, గురువారం గుడివాడలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్ ను ప్రారంబించారు. అన్న క్యాంటీన్లకు దాతల నుండి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్ లపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు .. ప్రభుత్వ పథకాలను ఎత్తివేసి పేదలకు పప్పన్నం పెడుతున్నారని విమర్శించారు.
నెల్లూరులో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. ప్రజల నుండి విరాళాలు సేకరించి అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తూ వాటికి పచ్చ (పార్టీ) రంగులు వేయడం ఎంత వరకు సబబు? అని ప్రశ్నించారు. క్యాంటీన్ లలో ఫోటోలు చంద్రబాబువి, విరాళాలు ప్రజలవా? అని కాకాణి నిలదీశారు.