Surge Pricing: 2 కి.మీ. లకు రూ.700 ఛార్జీ.. సర్జ్ ప్రైసింగ్ పేరుతో ఉబర్ దోపిడీ
- క్యాబ్ అవసరం ఉన్నపుడే రేట్లు అడ్డగోలుగా పెంచడం దారుణం
- నాలుగు చినుకులు పడితే క్యాబ్ ల రేట్లు చుక్కలను అంటుతాయని విమర్శలు
- ఉబర్, ఓలా, రాపిడో తదితర సంస్థలపై మండిపడుతున్న నెటిజన్లు
సామాన్యులకు అందుబాటు ధరలలో క్యాబ్ సేవలు అందించేందుకు పుట్టుకొచ్చిన సంస్థలు నేడు అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నాయని వినియోగదారులు మండిపడుతున్నారు. సర్జ్ ప్రైసింగ్ పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నాయని వాపోతున్నారు. క్యాబ్ ల అవసరం ఉన్నపుడే డిమాండ్ ఎక్కువగా ఉందనే పేరుతో రేట్లు విపరీతంగా పెంచుతున్నాయని విమర్శిస్తున్నారు. ఈమేరకు తాజాగా సూర్య పాండే అనే ప్రైవేట్ ఉద్యోగి లింక్డిన్ లో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ఉబర్, ఓలా, రాపిడో తదితర కంపెనీల సర్జ్ ప్రైసింగ్ పై సోషల్ మీడియాలో చర్చను లేవనెత్తింది.
సూర్య పాండే పోస్టులో కేవలం 1.8 కిలోమీటర్ల దూరానికి ఉబర్ క్యాబ్ కు రూ.699 ఛార్జి చూపిస్తోందని పేర్కొన్నాడు. అది కూడా అఫర్డబుల్ ప్రైస్ అని ఉబర్ కంపెనీ పేర్కొనడాన్ని పాండే ఎద్దేవా చేశాడు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కన్నా ఉబర్ సర్జ్ ప్రైసింగ్ పై పెట్టుబడి పెడితే ఈపాటికి తాను హర్షద్ మెహతాను మించిపోయేవాడినని వ్యంగ్యంగా పేర్కొన్నాడు. వినియోగదారులకు అవసరం ఉన్నపుడే క్యాబ్ ల రేట్లను విపరీతంగా పెంచడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు. ఇక, నాలుగు వర్షపు చినుకులు పడితే క్యాబ్ ల రేట్లు ఏకంగా 300 శాతం పెరుగుతాయని పాండే గుర్తుచేశారు. ఈ రేట్లను భరించడం కన్నా సింపుల్ గా ఉద్యోగులు తమ కంపెనీ పార్కింగ్ ఎగ్జిట్ దగ్గర నిలుచుని బయటకు వచ్చే కార్లను లిఫ్ట్ అడిగి వెళ్లడం ఉత్తమమని ఆయన చెప్పుకొచ్చాడు.
పాండే పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన పోస్టుపై చాలామంది నెటిజన్లు స్పందిస్తూ తమ అనుభవాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. 1.8 కిలోమీటర్ల దూరానికి రూ.699 ఛార్జీ కస్టమర్లు భరించతగ్గదేనంటూ ఓ యూజర్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. కొన్నిసార్లు ఈ యాప్ లలో క్యాబ్ ఛార్జీ కన్నా ఆటో ఛార్జీ ఎక్కువ ఉంటుందని విమర్శించాడు. వర్షం పడుతున్నపుడు క్యాబ్ బుక్ చేసుకోవడం కన్నా లిఫ్ట్ అడిగి ఇంటికి చేరుకోవడం ఉత్తమమని మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు.