Kolkata Doctor: ‘కూతురును పోగొట్టుకున్నా.. లక్షలాది కూతుళ్లను సంపాదించుకున్నా’: కోల్ కతా హత్యాచారబాధితురాలి తండ్రి
- తన కూతురుకు న్యాయం చేయాలంటూ జరుగుతున్న ఆందోళనలపై స్పందించిన తండ్రి
- చనిపోయిన తన కూతురు పేరు, ఫొటోలు షేర్ చేయొద్దంటూ విజ్ఞప్తి
- నిరసనలు చేస్తున్న వారంతా మా కూతుళ్లు, కొడుకులేనన్న బాధితురాలి తల్లి
‘కన్న కూతురును నేను పోగొట్టుకుని ఉండొచ్చు కానీ నాకిప్పుడు లక్షలాది మంది కూతుళ్లు దొరికారు.. వారంతా తమ సోదరికి జరిగిన అన్యాయంపై రోడ్డెక్కి పోరాడుతున్నారు’ అంటూ కోల్ కతాలో హత్యాచారానికి గురైన డాక్టర్ తండ్రి మీడియాతో వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు తమను కదిలించాయని పేర్కొన్నారు. అదే సమయంలో తన కూతురు పేరును కానీ డెడ్ బాడీ ఫొటోలు కానీ ప్రచురించవద్దని, సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాంటి వాటి వల్ల జనాలలోకి తప్పుడు సమాచారం పోతుందని అన్నారు.
ఆత్మహత్య చేసుకుందన్నారు..
తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆసుపత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఫోన్ చేసి చెప్పారని బాధితురాలి తల్లి చెప్పారు. ఉదయం 10:53 గంటలకు ఫోన్ రాగా వెంటనే తాము ఆసుపత్రికి వెళ్లామని వివరించారు. అయితే, తమ కూతురు డెడ్ బాడీని చూడనివ్వలేదని, చివరికి మధ్యాహ్నం 3 గంటలకు మృతదేహాన్ని చూడనిచ్చారని ఆరోపించారు. ఈ దారుణంపై, ఆసుపత్రి సిబ్బంది, పోలీసుల తీరుపై తమకు సందేహాలు ఉన్నాయని అన్నారు. సీఎం మమతా బెనర్జీ మమ్మల్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు.. సంజయ్ రాయ్ (ఈ దారుణానికి పాల్పడ్డాడంటూ పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తి) ఈ ఘోరం చేసి ఉండకపోవచ్చని తాము ఆమెకు చెప్పామని అన్నారు. దీంతో తాను కూడా ఈ కేసులో సీబీఐ విచారణ చేయాలని కోరుకుంటున్నట్టు సీఎం మమత చెప్పారన్నారు. తమ కూతురు మరణంపై దేశవ్యాప్తంగా, విదేశాల్లో కూడా నిరసనలు చేస్తున్న వారంతా తమ పిల్లలేనని బాధితురాలి తల్లి పేర్కొన్నారు.