MS Dhoni: ఐపీఎల్ 2025 సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఎంఎస్‌ ధోనీ!

MS Dhoni could be treated as Uncapped Player in IPL 2025

  • మహీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా తీసుకునేందుకు చెన్నై మొగ్గు
  • ప్ర‌స్తుతం ఉప‌యోగంలో లేని అన్‌క్యాప్డ్ ప్లేయర్ నిబంధ‌న‌
  • ధోనీ విషయంలో దీన్ని అమలులోకి తీసుకురావాలని బీసీసీఐకి సీఎస్‌కే విజ్ఞప్తి 
  • ఒకవేళ ఈ రూల్‌ అందుబాటులోకి వస్తే నిధుల పరంగా చెన్నైకి మేలు

ఐపీఎల్ 2025 సీజన్‌లో మ‌హేంద్ర సింగ్‌ ధోనీ ఆడతాడా? లేదా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ఎంఎస్‌డీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా తీసుకునేందుకు చెన్నై ఫ్రాంఛైజీ మొగ్గు చూపిస్తోందని స‌మాచారం.

అస‌లేంటీ అన్‌క్యాప్డ్ ప్లేయర్? 

సాధారణంగా అన్‌క్యాప్డ్ ప్లేయర్ అంటే జాతీయ జ‌ట్టుకు ప్రాతినిథ్యం వహించని క్రికెటర్‌ అని అర్థం. అంటే దేశవాళీలో ఆడుతూ అంత‌ర్జాతీయ‌ క్రికెట్‌లోకి ఇంకా అడుగుపెట్టని ఆటగాళ్లను అలా పిలుస్తుంటారు. అలానే ఇంటర్నేషనల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ప్లేయ‌ర్ల‌ను కూడా ఇలానే పిలుస్తుంటారు. 

కానీ, ఈ నిబంధన ఇప్పుడు ఉప‌యోగంలో లేదు. అయితే ఇప్పుడు ధోనీ విషయంలో దీనిని అమలులోకి తీసుకురావాలని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) బీసీసీఐకి విజ్ఞప్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. గత నెలాఖరున జరిగిన సమావేశంలో బీసీసీఐ దృష్టికి ఈ రిటెన్షన్ నిబంధ‌న‌ను సీఎస్‌కే తీసుకెళ్లగా బోర్డు కూడా సానూకులంగానే స్పందించినట్లు సమాచారం.

అయితే, 2025 ఐపీఎల్‌ వేలంలో ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించే విష‌య‌మై సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్‌ను అడిగినప్పుడు.. "నాకు దాని గురించి తెలియదు. మేము దాని కోసం అభ్యర్థించలేదు. అయితే, 'అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్'ను సమర్థవంతంగా అమలు చేయడం గురించి బీసీసీఐ మాకు తెలియజేసింది. కానీ, ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు" అని 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో చెప్పారు. 

ఒకవేళ ఈ నిబంధ‌న‌ అందుబాటులోకి వస్తే నిధుల పరంగా చెన్నైకి మంచి ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం ధోనీ రూ.12 కోట్లు వరకు అందుకుంటున్నాడు. ఒకవేళ అన్‌క్యాప్డ్ ఆట‌గాడిగా ఆడితే అతడికి రూ.4 కోట్లకు మించి ఇవ్వనక్కర్లేదు. దీంతో మిగిలిన సొమ్మును పెద్ద ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. 

ధోనీ ఏమన్నాడంటే? 

వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతారా? అని అడిగిన ప్రశ్నకు హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ స్పందించాడు. "సీజన్ కు ఇంకా చాలా సమయం మిగిలి ఉంది. ప్లేయర్ రిటెన్షన్ నిబంధనపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూద్దాం. ఐపీఎల్‌లో నా భవిష్యత్తు పూర్తిగా రాబోయే వేలంలో ప్లేయర్ రిటెన్షన్ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది" అని పేర్కొన్నాడు.

2024 ఐపీఎల్‌ సీజ‌న్‌లో ధోనీ ప్రదర్శన ఇలా...

ఐపీఎల్‌ 2024 ప్రారంభానికి ముందు ధోని చెన్నై కెప్టెన్సీని భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. ఇక సీజ‌న్ మొత్తం డెత్ ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్ చేసినప్పటికీ అతను కేవలం 73 బంతుల్లో 220.54 స్ట్రైక్ రేట్, 53.66 సగటుతో 161 పరుగులు చేశాడు. అలాగే కీపింగ్‌లోనూ అద‌ర‌గొట్టాడు. మొత్తానికి మునుప‌టి ధోనీని గుర్తు చేశాడు.

  • Loading...

More Telugu News