Ram Charan: ఆస్ట్రేలియా గడ్డపై రామ్ చరణ్ కు విశిష్ట గౌరవం
- రామ్ చరణ్ కు ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ అవార్డు
- మెల్బోర్న్ లోని ఫెడ్ స్క్వేర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రామ్ చరణ్
- ఆస్ట్రేలియాను భారతీయులు సొంతగడ్డలాగానే భావిస్తారన్న గ్లోబల్ స్టార్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) వేదికగా రామ్ చరణ్ కు 'ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్' పురస్కారం అందజేశారు.
ఇక ప్రఖ్యాత ఫెడ్ స్క్వేర్ వద్ద జరిగిన భారత జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలోనూ రామ్ చరణ్ పాల్గొన్నారు. త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2009లో 'ఆరెంజ్' చిత్రం షూటింగ్ కోసం ఆస్ట్రేలియా వచ్చానని, ఆ సమయంలో తన పట్ల ఇక్కడి ప్రజలు చూపించిన ఆదరణను మర్చిపోలేనని తెలిపారు.
గతంలో కంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది భారతీయులు కనిపిస్తున్నారని, దాంతో భారత్ లోనే ఉన్నట్టు అనిపిస్తోందని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాను కూడా భారతీయులు తమ సొంతగడ్డలాగానే భావిస్తారని, ఇక్కడ భద్రంగా ఉంటున్నారని పేర్కొన్నారు. "థాంక్యూ మెల్బోర్న్... థాంక్యూ ఆస్ట్రేలియా... థాంక్యూ ఇండియా" అంటూ తన ప్రసంగం ముగించారు.