UP Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
- వ్యాను, బస్సు ఢీ.. పదిమంది దుర్మరణం
- మరో 27 మందికి తీవ్ర గాయాలు
- మృతులంతా అలీగఢ్ జిల్లాకు చెందిన కార్మికులు
ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కార్మికులను ఇళ్లకు తీసుకెళుతున్న పికప్ వ్యాను, ఓ ప్రైవేటు బస్సు ఢీ కొన్నాయి. దీంతో ఫ్యాక్టరీ కార్మికులు పదిమంది అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బులంద్ షహర్ లోని ఓ ఫ్యాక్టరీకి చెందిన కార్మికులను పికప్ వ్యాన్ ఆదివారం ఇళ్లకు తీసుకెళుతోంది. సేలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుగా వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు కార్మికుల పికప్ వ్యాన్ ను బలంగా ఢీ కొట్టింది. దీంతో పికప్ వ్యాన్ లోని పదిమంది కార్మికులు స్పాట్ లోనే చనిపోయారు. మరో 27 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా అలీగఢ్ జిల్లా రాయ్ పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. జిల్లా కలెక్టర్ చంద్రప్రకాశ్ సింగ్, ఎస్ఎస్పీ శ్లోక్ కుమార్ జిల్లా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.