Balakrishna: బాలకృష్ణ నట ప్రస్థానానికి 50 ఏళ్లు... వేడుకలకు రావాలంటూ చిరంజీవికి ఆహ్వానం
- 1974లో తాతమ్మ కల చిత్రంలో బాలయ్య కెరీర్ ప్రారంభం
- వందలాది చిత్రాలు, భారీ సంఖ్యలో అవార్డులతో కలర్ ఫుల్ గా బాలయ్య కెరీర్
- సెప్టెంబరు 1న హైదరాబాదులో బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
నందమూరి బాలకృష్ణ... జగద్విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, కొద్దికాలంలోనే అగ్రనటుల్లో ఒకరిగా పేరుగాంచారు.
బాలయ్య కెరీర్లో అందుకున్న అవార్డుల జాబితా చూస్తే చాంతాడంత ఉంటుంది. మూడు నంది అవార్డులు, ఏడు ఫిలింఫేర్ అవార్డులు, ఒక సైమా అవార్డు, మూడు సంతోషం అవార్డులు, మూడు టి.సుబ్బరామిరెడ్డి పురస్కారాలు... ఇలా చెప్పుకుంటూ పోతే బాలకృష్ణ అవార్డుల జాబితా చాలానే ఉంటుంది.
ఇక అసలు విషయానికొస్తే... 1974లో తాతమ్మ కల చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన బాలయ్య నట ప్రస్థానానికి 50 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా సెప్టెంబరు 1న హైదరాబాదులో భారీగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు, వివిధ చిత్ర పరిశ్రమ సంఘాల ప్రతినిధులు, మా సభ్యులు చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనకు ఆహ్వాన పత్రం అందజేశారు.