Mohanlal: తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మోహన్ లాల్
- హై ఫీవర్, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న మోహన్ లాల్
- కొచ్చిలోని అమృత హాస్పిటల్ లో చికిత్స
- మోహన్ లాల్ కు ఐదు రోజులు పూర్తి విశ్రాంతి అవసరమన్న ఆసుపత్రి వర్గాలు
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మోహన్ లాల్ అధిక జ్వరంతో బాధపడుతూ, ఊపిరి అందని స్థితిలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కొచ్చిలోని అమృత ఆసుపత్రికి తరలించారు.
మోహన్ లాల్ ఇటీవలే భారీ బడ్జెట్ చిత్రం 'ఎల్2 ఎంపురాన్' చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ చిత్రం గుజరాత్ షెడ్యూల్ ను ముగించుకుని కొన్ని రోజుల కిందటే కేరళ తిరిగొచ్చారు. అంతేకాదు, తన దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న 'బరోజ్' మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనూ పాల్గొన్నారు.
కాగా, మోహన్ లాల్ కు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఆయనకు ఐదు రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వెల్లడించాయి. పూర్తిగా కోలుకునే వరకు జనసమ్మర్దం ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని సూచించాయి.
మోహన్ లాల్ తమ ఆసుపత్రిలో చేరే సమయానికి హై ఫీవర్, శ్వాసకోశ సంబంధ సమస్యలు, మయాల్జియాతో బాధపడుతున్నారని అమృత హాస్పిటల్ తన ప్రకటనలో పేర్కొంది. ఆయనకు వైరస్ సంబంధిత శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కూడా సోకిందని వెల్లడించింది.