Supreme Court: కోల్ కతా హత్యాచార ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు
- కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో దారుణం
- జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య
- ఈ ఘటనపై ఎల్లుండి విచారణ జరపనున్న సీజేఐ ధర్మాసనం
కోల్ కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ట్రెయినీ డాక్టర్ పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాగా, ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మంగళవారం నాడు విచారణ జరగనుంది.
సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరపనుందని సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో పేర్కొన్నారు. ఈ బెంచ్ లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తో పాటు, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు.
కాగా, కోల్ కతా హత్యాచార ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించాలంటూ సీజేఐ డీవై చంద్రచూడ్ ను ఉద్దేశించి మోనికా సింగ్ అనే వైద్యురాలు ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. తక్షణమే నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.