Mamata Banerjee: సీఎం మమతా బెనర్జీపై నమ్మకం పోయింది: హత్యాచార మృతురాలి తండ్రి
- కోల్ కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం
- జరుగుతున్న పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేసిన మృతురాలి తండ్రి
- న్యాయం కోసం ముఖ్యమంత్రి చేస్తున్నది ఏమీ లేదని వ్యాఖ్యలు
కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు తాజా పరిణామాల పట్ల కలత చెందుతున్నట్టు తెలిపారు. మృతురాలి తండ్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై నమ్మకం పోయిందని అన్నారు.
"ఇంతకుముందు మమతా బెనర్జీపై ఎంతో నమ్మకం ఉండేది. ఇప్పుడా భావన పోయింది. ఆమె కూడా న్యాయం చేయాలని అడుగుతున్నారు. కానీ ఆ దిశగా ఆమె చేస్తున్నది ఏమీ లేదు. ఓవైపు ఆమె న్యాయం కావాలి అంటూనే... న్యాయం కావాలి అని నినదిస్తున్న సాధారణ ప్రజలను నిర్బంధిస్తున్నారు. ఆమె ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడంలేదు.
ఈ హత్యాచార ఘటనలో సీసీటీవీ ఫుటేజి ప్రకారం సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేశారు. కానీ ఒక్కడి వల్ల ఈ ఘాతుకం జరిగి ఉండదని, ఇందులో ఇతరులు కూడా ఉండొచ్చని అందరూ అంటున్నారు. మేం మొదటి నుంచి ఇదే చెబుతున్నాం" అని వ్యాఖ్యానించారు.