Kolkata Incident: ప్రత్యేక చట్టాన్ని తీసుకురండి.. కోల్‌కతా హత్యాచార ఘటనపై ప్రధానికి పద్మ అవార్డు గ్రహీతల లేఖ
- వైద్యులపై జరుగుతున్న హింసాత్మక దాడులకు అడ్డుకట్ట వేసేలా చట్టాన్ని తీసుకురావాలని అభ్యర్థన
- ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరిన పద్మశ్రీలు
- సాధ్యమైనంత త్వరగా పరిష్కారాన్ని వెతకాలని విజ్ఞప్తి
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ హాస్పిటల్‌లో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనను యావత్ దేశం ఖండిస్తోంది. క్రూరమైన ఈ ఘటనను నిరసిస్తూ, హాస్పిటల్స్‌లో వైద్యులకు పటిష్ఠమైన భద్రత కల్పించాలంటూ ఇప్పటికే వైద్యులు ఆందోళన బాట పట్టగా.. వారికి అన్ని వర్గాలు సంఘీభావం తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో వైద్యరంగానికి చెందిన 70 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కీలక లేఖ రాశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని, ఇలాంటి క్రూరమైన చర్యలు వైద్య సేవలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీకి లేఖ రాసిన వారిలో ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డా.బలరాం భార్గవ, ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డా. రణ్‌దీప్ గులేరియా, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలైరీ సైన్సెస్ డైరెక్టర్ డా.ఎస్ కే సారిన్, తదితరులు ఉన్నారు.
వైద్య రంగంలో పనిచేస్తున్న వారిపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చట్టాన్ని సాధ్యమైనంత త్వరగా తీసుకురావాలని కోరారు. హాస్పిటల్స్‌లో మెరుగైన భద్రతా నిబంధనలను అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని కోరారు. మహిళలు, చిన్నారులు, వైద్య సిబ్బందిపై జరుగుతోన్న దాడులు, హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.