Nokia Phone Collection: నోకియా ఫోన్ల సేకరణలో గిన్నిస్ రికార్డ్.. వేల ఫోన్లతో ఇంటిని మ్యూజియంగా మార్చేశాడు!
- నోకియా ఫోన్ల సేకరణలో గిన్నిస్బుక్లోని ఫెర్నాండెజ్
- 700కుపైగా మోడళ్లు.. 3,615 ఫోన్లు
- నోకియా ఫోన్లతో ఇంటిని మ్యూజియంగా మార్చేసిన నోకియా ప్రేమికుడు
కొందరికి కొన్ని హాబీలు ఉంటాయి. కొంతమందికి కరెన్సీ సేకరణ అలవాటైతే.. మరికొందరికి పెన్నులు.. ఇంకొందరికి నాణేలు.. మరికొందరికి అగ్గిపెట్టెలు.. సేకరించేది ఏదైనా దానిని చాలా ఇష్టంతో చేస్తుంటారు. ఇందుకోసం వ్యయ ప్రయాసలను సైతం లెక్క చేయరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ హాబీని కొనసాగిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు స్పెయిన్కు చెందిన వెన్సెస్ పలావ్ ఫెర్నాండెజ్.
ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన నోకియా ఫోన్లంటే అతడికి చచ్చేంత ఇష్టం. ఆ ఇష్టంతోనే వాటిని సేకరించడం ప్రారంభించాడు. అలా సేకరించిన వాటిని ఇంట్లోనే భద్రపరిచాడు. ఇప్పుడా ఇల్లు ఓ మ్యూజియంలా మారిపోయింది. అలా సేకరించిన ఫోన్ల సంఖ్య 3,615 దాటేయడంతో ఇటీవలే గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. గతంలో రొమేనియాకు చెందిన ఆండ్రీ బిల్బీ అర్జెంటీస్ 3,456 నోకియా ఫోన్ల సేకరణతో రికార్డులకెక్కగా, ఇప్పుడు ఫెర్నాండెజ్ దానిని బద్దలుగొట్టి తన పేరున రికార్డు రాసుకున్నాడు.
1999లో నోకియా 3210 ఫోన్ను బహుమతిగా అందుకున్న ఫెర్నాండెజ్ దానిపై మనసు పారేసుకున్నాడు. 2008 నుంచి నోకియా ఫోన్లను సేకరించడం మొదలుపెట్టి తన హాబీని కొనసాగిస్తూ వస్తున్నాడు. 2018 నాటికి 700కుపైగా నోకియా మోడళ్లను సేకరించాడు. నోకియా విడుదల చేసే ఫోన్లు అన్నీ తన వద్ద ఉండాలన్న ఉద్దేశంతోనే తాను ఈ సేకరణకు నడుం బిగించానని, అమ్మకానికి కాదని ఫెర్నాండెజ్ చెప్పుకొచ్చాడు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి