Abhishek Manu Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్
- నామినేషన్ కార్యక్రమంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు
- సెప్టెంబర్ 3న తొమ్మిది రాష్ట్రాల్లో 12 స్థానాలకు ఉప ఎన్నిక
- కేకే రాజీనామాతో తెలంగాణలో ఏర్పడిన ఖాళీ
తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ హాజరయ్యారు.
రాజ్యసభలో తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు పీయూష్ గోయల్, శరబానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, కామాఖ్య ప్రసాద్, వివేక్ ఠాకూర్, రాజే భోస్లే, బిప్లబ్ కుమార్ దేవ్, మీసా భారతి, దీపేంద్రసింగ్ హుడా, కేసీ వేణుగోపాల్ లోక్ సభకు ఎన్నికయ్యారు. వీరు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఒడిశాలో బీజేడీ ఎంపీ మమతా మొహంత పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో కే కేశవరావు బీఆర్ఎస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో 12 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు నామినేషన్ దాఖలుకు గడువు ఉంది.