Kolkata medical college incident: కోల్కతా వైద్యురాలిపై హత్యాచారం కేసు... నిందితుడికి నిజనిర్ధారణ పరీక్ష
- సీబీఐకి అనుమతి ఇచ్చిన కలకత్తా హైకోర్ట్
- రేపే లై డిటెక్టర్ టెస్టు నిర్వహించే అవకాశం
- ఈ నేరంలో ఇతరుల ప్రమేయంపై అనుమానం... అన్ని కోణాల్లో సీబీఐ దర్యాప్తు
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ-ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్కి నిజనిర్ధారణ పరీక్ష (టై డిటెక్టర్ టెస్ట్) నిర్వహిచేంచేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐకి కలకత్తా హైకోర్ట్ అనుమతి ఇచ్చింది.
వైద్యురాలిపై హత్యాచారం జరిగినప్పటికీ ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఈ నేరంలో ఇతరుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నిందితుడికి నిజనిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారులు కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు నిందితుడికి రేపు (మంగళవారం) పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసుపై విచారణ ఆగస్టు 29కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.
కాగా హాస్పిటల్లో నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు సంజయ్ రాయ్ కదలాడడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఆత్మహత్య అంటూ ఆమె తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం అందించిన నేపథ్యంలో, ఆమెపై సామూహిక అత్యాచారం ఏమైనా జరిగిందా?, ఇంకెవరి పాత్రైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.