Nagababu: నాగబాబుకు కీలక పదవి ఖాయమైందా?
- ఇటీవలి ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన నాగబాబు
- గతంలో టీడీడీ చైర్మన్ పోస్టు అంటూ ప్రచారం
- ఆ వార్తలను అప్పుడే ఖండించిన నాగబాబు
- ఈసారి మాత్రం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి!
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు త్వరలోనే ప్రభుత్వంలో కీలక పదవిని చేపట్టబోతున్నారా? ఇప్పుడీ విషయం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాగబాబు కూడా కీలకంగా పనిచేశారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం చెమటోడ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయం కోసం కష్టపడిన నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో నాగబాబుకు కూడా కీలక పదవి దక్కబోతోందన్న ప్రచారం ఊపందుకుంది. నాగబాబును టీటీడీ చైర్మన్‌గా నియమించబోతున్నారన్న ప్రచారం ఇటీవల జరిగింది. అయితే, దానిని ఆయన ఖండించారు. తనకు అలాంటి ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రచారానికి ఫుల్స్టాప్ పడింది. అయితే, తాజాగా మరోమారు ఆయనకు పదవిపై ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో నాగబాబుని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కూడా ఇప్పటికే తన సోదరుడి పేరును నిర్ధారించినట్టు పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే నాగబాబు ఎఫ్డీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు.