Motkupalli: పదవి అవసరం లేదు... రేవంత్ వెంట ఉంటా: మోత్కుపల్లి నర్సింహులు
- ఎస్సీ వర్గీకరణ చేస్తామని రేవంత్ ప్రకటించడంపై మోత్కుపల్లి హర్షం
- సీఎం ప్రకటన మాదిగ జాతికి ధైర్యాన్ని ఇచ్చిందని వ్యాఖ్య
- 80 లక్షల మంది మాదిగలతో సభ పెడతానన్న మోత్కుపల్లి
ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నానని సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆగస్ట్ 1 నాడు మాదిగలకు, మాదిగ ఉపకులాలకు స్వాతంత్ర్యం వచ్చిందని రేవంత్ చెప్పారని తెలిపారు. తనకు ఎన్నికల్లో సీట్ రాలేదని మొన్నటి వరకు ఎంతో బాధ ఉండేదని... కానీ ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత... ఆ విషయాన్ని అసెంబ్లీలో సీఎం ప్రకటించిన తర్వాత ఎంతో ఆనందపడ్డానని చెప్పారు.
రేవంత్ రెడ్డి ప్రకటన మాదిగ జాతి మొత్తానికి ధైర్యాన్ని ఇచ్చిందని మోత్కుపల్లి అన్నారు. జాతి మొత్తం రేవంత్ వెంట ఉందని... ఆయనకు తాము అన్ని విధాలుగా రుణపడి ఉంటామన్నారు. రేవంత్ శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండొచ్చని చెప్పారు. దేశానికే ఆదర్శవంతమైన సీఎంగా రేవంత్ నిలుస్తారని అన్నారు. మంద కృష్ణ మాదిగను కూడా రేవంత్ కు అండగా తీసుకొస్తామని చెప్పారు. తనకు ఎలాంటి పదవి అవసరం లేదని... ఒక కార్యకర్తగా ముఖ్యమంత్రి వెనుక ఉంటూ పని చేస్తానని తెలిపారు.
రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని మోత్కుపల్లి కోరారు. 80 లక్షల మంది మాదిగలను హైదరాబాద్ కు తీసుకొచ్చి సభ పెడతామని చెప్పారు. మాదిగ జాతికి సీఎం రేవంత్ పెద్ద మాదిగ అన్నారు.