Basit Ali: బుమ్రా కెప్టెన్సీ జోలికి వెళ్లకపోవడమే మంచిదంటున్న పాక్ మాజీ క్రికెటర్
- జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు పేస్ బౌలర్లకు అవకాశాలు తక్కువ అన్న బుమ్రా
- ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన కెప్టెన్సీ చేయగలరని వ్యాఖ్య
- ఉదాహరణగా కపిల్, ఇమ్రాన్ విజయవంతమైన కెప్టెన్సీలను గుర్తు చేసిన స్పీడ్‌స్టర్
- బుమ్రా వ్యాఖ్యలతో విభేదించిన పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ
- బుమ్రా ఒక టాప్ క్లాస్ బౌలర్ కనుక దానిపైనే దృష్టి పెట్టాలని సూచన
జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు పేస్ బౌలర్లకు అవకాశాలు అంతగా లేవని భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ స్పందించాడు. గత నెలలో ఒక ఇంటర్వ్యూలో బుమ్రా మాట్లాడుతూ ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన కెప్టెన్సీ చేయగలరని అన్నాడు. దానికి ఉదాహరణగా కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ విజయవంతమైన కెప్టెన్సీలను పేర్కొన్నాడు. వారి సారథ్యంలోనే ఇరు దేశాలు ప్రపంచ కప్ విజేతలుగా నిలిచాయని బుమ్రా చెప్పుకొచ్చాడు.
అయితే, బాసిత్ అలీ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ బుమ్రా వ్యాఖ్యాలతో విభేదించాడు. కపిల్, ఇమ్రాన్ ఇద్దరూ బౌలర్లే కాకుండా ఆల్ రౌండర్లుగా తమను తాము నిరూపించుకున్న తర్వాతే కెప్టెన్లుగా నియమించబడ్డారని అతను గుర్తు చేశాడు.
"జస్ప్రీత్ బుమ్రా మాటలు వింటుంటే.. బాబర్ అజామ్ కెప్టెన్సీని ఎలా ఇష్టపడతాడో అలాగే ఉందనేది నా అభిప్రాయం. అతను కెప్టెన్సీ కోసం వెంపర్లాడకూడదు. బుమ్రా ఒక టాప్ క్లాస్ బౌలర్ కనుక దానిపై దృష్టి పెట్టాలి" అని బాసిత్ సూచించాడు.
అలాగే ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా రాణించడాన్ని విజయాన్ని అంగీకరిస్తూనే కెప్టెన్ లేదా కోచ్‌గా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్లు చాలా తక్కువ మంది అని బాసిత్ అన్నాడు.
"అవును కమిన్స్ మంచి కెప్టెన్. కానీ చాలా తక్కువ మంది ఫాస్ట్ బౌలర్లు మాత్రమే మంచి కోచ్ లేదా కెప్టెన్‌గా మారగలరు. జస్ప్రీత్ బుమ్రాకు నా శుభాకాంక్షలు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతన్ని కెప్టెన్‌గా చేసే అవకాశం ఉంది" అని బాసిత్ తెలిపాడు.
ఇదిలాఉంటే.. బుమ్రా 2022లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌కు టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే గతేడాది ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు అతని నాయకత్వంలోనే 2-0తో విజయం సాధించింది.