Ponnam Prabhakar: రుణమాఫీ విషయంలో ఆందోళన వద్దు: రైతులకు పొన్నం ప్రభాకర్ హామీ
- రుణమాఫీపై బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపాటు
- రూ.2 లక్షల లోపు రుణాలు పొందిన వారికి మాఫీ జరుగుతుందని హామీ
- కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్న మంత్రి
రుణమాఫీ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రుణమాఫీపై బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నంచి 2023 డిసెంబర్ 9 లోపు రూ.2 లక్షల రుణాలు పొందిన రైతులందరికీ తప్పకుండా మాఫీ జరుగుతుందన్నారు.
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర తమ ప్రభుత్వానిదే అన్నారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసినప్పటికీ 8 సీట్లు కూడా దాటలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను క్రమంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లు సంతోషంగా బస్సులో ప్రయాణించేందుకు ఆర్టీసీ సిబ్బంది ఎంతో కృషి చేసిందని ప్రశంసించారు. ఈ పండుగ రోజున దాదాపు రూ.15 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కానీ కూల్చివేస్తామని కేటీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే వారిని వారే అవమానించుకున్నట్లు అవుతుందన్నారు.