Stock Market: లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు
- తగ్గిపోయిన అమెరికా మాంద్యం భయాలు
- కాల్పుల విరమణపై ఇజ్రాయెల్-హమాస్ మధ్య చర్చలు
- మార్కెట్‌కు ఊతమిచ్చిన అంతర్జాతీయ పరిణామాలు
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ సానుకూల సెంటిమెంట్‌తో సూచీలు రోజంతా లాభాల్లోనే కనిపించాయి. సెన్సెక్స్ 378 పాయింట్లు లేదా 0.47 శాతం ఎగిసి 80,802 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 126 పాయింట్లు లాభపడి 24,698 పాయింట్ల వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ స్టాక్స్ అదరగొట్టాయి. నిఫ్టీ బ్యాంక్ 434 పాయింట్లు లాభపడి 50,803 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్-30లో బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, విప్రో, ఎన్టీపీసీ, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్ లాభాల్లో ముగిశాయి. భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యు స్టీల్, అల్ట్రా టెక్ సిమెంట్ నష్టాల్లో ముగిశాయి.
ఎన్ఎస్ఈలో ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, ఫిన్ సర్వీసెస్, ఫార్మా, మెటల్, ఎనర్జీ, ఇన్ఫ్రా, ప్రైవేటు బ్యాంకులు లభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, మీడియా రంగాలు మాత్రమే నష్టపోయాయి.
మార్కెట్ స్థిరత్వాన్ని సూచిస్తూ... ఇండియా వీఐఎక్స్ 3.49 శాతం తగ్గుదల నమోదు చేస్తూ 13.82 పాయింట్ల వద్ద ఉంది.
అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి. ఇజ్రాయెల్ - హమాస్ కాల్పుల విరమణ చర్చల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ ప్రభావం దేశీ మార్కెట్‌పై కనిపించింది. అలాగే అమెరికాలో మాంద్యం భయాలు తగ్గడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.