Jogi Ramesh: పోలీసుల ఎదుట విచారణకు హాజరైన జోగి రమేశ్
- చంద్రబాబు నివాసంపై దాడి కేసులో హాజరైన మాజీ మంత్రి
- పోలీసులు మరోసారి విచారణకు పిలువలేదన్న జోగి రమేశ్
- పోలీసులు కోరితే మళ్లీ విచారణకు హాజరవుతానని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేత జోగి రమేశ్ బుధవారం మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన విచారణకు హాజరు కావడం ఇది రెండోసారి. మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సమక్షంలో మాజీ మంత్రిని పోలీసులు ప్రశ్నించారు.
విచారణ అనంతరం జోగి రమేశ్ మాట్లాడుతూ... పోలీసులు తనను మరోసారి విచారణకు పిలువలేదన్నారు. పోలీసులు కోరితే తాను మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమే అన్నారు.
చంద్రబాబు నివాసంపై దాడి సమయంలో జోగి రమేశ్ వినియోగించిన సెల్ ఫోన్, సిమ్ కార్డ్ వివరాలను అందించాలని మూడు రోజుల క్రితం పోలీసులు నోటీసులు జారీ చేశారు. జోగి రమేశ్ న్యాయవాది వెంకటేశ్వర శర్మ నిన్న మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు కొన్ని వివరాలను అందించారు.
నిందితుడి ఫోన్, సిమ్ కార్డు వివరాలు తీసుకోవద్దని పలు కేసుల్లో కోర్టులు తీర్పులు ఇచ్చాయని న్యాయవాది... పోలీసులకు తెలిపారు. సంతృప్తి చెందని పోలీసులు స్వయంగా వచ్చి వివరాలు అందించాలని జోగి రమేశ్‌కు మరోసారి నోటీసులు ఇచ్చారు. దీంతో ఈరోజు ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు.