AP High Court: నిబంధనల అమలులో విఫలం .. ట్రాఫిక్ పోలీసులపై ఏపీ హైకోర్టు అసహనం
- 99శాతం మంది ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించకుండానే వాహనాలు నడుపుతున్నారని హైకోర్టు వ్యాఖ్య
- హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలని ఇచ్చిన అదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టీకరణ
- పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హోంశాఖకు ఆదేశాలు
ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలనే నిబంధనను అమలు చేయడంలో రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు విఫలమయ్యారని ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మోటారు వాహన చట్టం నిబంధనలు పాటించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది యోగేష్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఎలక్ట్రానిక్ విజిలెన్స్ ఉండాలని కోరారు. ఈ పిటిషన్ పై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని వ్యాఖ్యానించింది. 99 శాతం మంది హెల్మెట్ ధరించకుండానే ద్విచక్ర వాహనాలు నడుపుతున్న విషయాన్ని తాము గమనించామని చెప్పింది. హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. తాము ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఎంత మంది ప్రమాదాల్లో మరణించారు? ఇప్పటి వరకూ ఎన్ని చలనాలు విధించారు? తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను ధర్మాసనం ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.