Chandrababu: కోల్ కతా హత్యాచార ఘటనపై కేజీహెచ్ వద్ద ఆందోళన... మద్దతు తెలిపిన సీఎం చంద్రబాబు
- కోల్ కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం
- దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు
- నేడు విశాఖలో ఆందోళన చేపట్టిన జూనియర్ వైద్యులు
- రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో డాక్టర్ల భద్రతకు చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు
- మీ కెపాసిటీ మాకు తెలుసు సార్ అంటూ జూనియర్ డాక్టర్ల స్పందన
కోల్ కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ప్రకంపకనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ విశాఖపట్నంలోని కేజీహెచ్ వద్ద కూడా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. హత్యాచార మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్ల భద్రతకు భరోసా ఇవ్వాలని నినాదాలు చేశారు.
కాగా, అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... కేజీహెచ్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లను కలిసి, వారితో మాట్లాడారు. వారికి మద్దతు పలికారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లోనూ డాక్టర్ల భద్రతకు గట్టి చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.
దాంతో, జూనియర్ వైద్యులు స్పందిస్తూ... మీ కెపాసిటీ మాకు తెలుసు సార్... మాకు నమ్మకం ఉంది... మీరు ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం అని పేర్కొన్నారు.