Pawan Kalyan: చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే: పవన్ కల్యాణ్
- ఏపీని గట్టెక్కించే సత్తా చంద్రబాబుకే ఉందన్న పవన్
- ప్రజల కోసం కూలీగా పని చేస్తానని వ్యాఖ్య
- వైసీపీ పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందనని విమర్శ
ఏపీకి చంద్రబాబు అనుభవం అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి తప్పించేందుకు, సంపద సృష్టించేందుకు చంద్రబాబు అనుభవం అవసరమని చెప్పారు. చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు.
పంచాయతీలకు ప్రభుత్వ పరంగా ఆస్తులు లేకపోతే వ్యర్థమని పవన్ చెప్పారు. ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలని అన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకోబోమని... అవసరమైతే గూండా యాక్ట్ తెస్తామని చెప్పారు. గ్రామాల్లో క్రీడా మైదానాలు కూడా లేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు ఉంటే నిర్మాణాలు చేసుకోవచ్చని చెప్పారు. దాతలు ముందుకు రావాలని... తాను కూడా నిధులు తీసుకొచ్చి క్రీడా మైదానాలను ఏర్పాటు చేయిస్తానని తెలిపారు.
అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదని... కానీ, గుండెల నిండా నిబద్ధత ఉందని పవన్ అన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని చెప్పారు. ఎంతో పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నుంచి నేర్చుకోవాలనే తపన తనకుందని అన్నారు. ప్రజల కోసం కూలీగా పని చేసేందుకు సిద్ధమని చెప్పారు.
వైసీపీ పాలనలో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని పవన్ విమర్శించారు. 75 శాతం గ్రామాల్లో వైసీపీకి చెందిన సర్పంచ్ లే ఉన్నారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ పని చేయాలని సూచించారు. పంచాయతీ వ్యవస్థ దేశానికి వెన్నెముక అని చెప్పారు. పదవులు తనకు అలంకరణ కాదని... బాధ్యత అని అన్నారు.