Nalgonda District: నల్లగొండలో అమానవీయ ఘటన.. కుర్చీలోనే ప్రసవించిన మహిళ!
- నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
- తొలుత పురిటినొప్పులతో జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన బాధితురాలు
- అక్కడ వైద్యులు లేకపోవడంతో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబీకులు
- మూడో కాన్పు పేరిట అక్కడి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం
- బయట కుర్చీలో కూర్చోబెట్టడంతో అక్కడే ప్రసవం
నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ ప్రసవించింది. నేరడుగొమ్మ మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని అనే గర్భిణి గురువారం రాత్రి పురిటినొప్పులతో జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అయితే, అక్కడ వైద్యులు లేకపోవడంతో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది రిఫర్ చేశారు.
దాంతో దేవరకొండ నుంచి అశ్వినిని ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో నల్గొండ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆసుపత్రి సిబ్బంది వారిని ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ దుర్భాషలాడారు. మూడో కాన్పు అంటున్నారు కనుక దేవరకొండలోనే చేయించక ఇక్కడి దాక రావడం అవసరమా? అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. అక్కడ డాక్టర్లు లేరని, అందుకే ఇక్కడికి తీసుకొచ్చామని కుటుంబ సభ్యులు చెప్పారు.
ఇక అశ్వినిని నర్సులు బయట కుర్చీలోనే కూర్చోబెట్టారు. పాపం.. నొప్పులు వస్తున్నాయని చెప్పిన అక్కడి సిబ్బంది ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీవ్ర నొప్పులతో అశ్విని కుర్చీలోనే ప్రసవించింది. దాంతో కుర్చీ కింద తీవ్ర రక్త స్రావమైంది. అప్పుడు నర్సులు హడావుడిగా వచ్చి ఆమెపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇలా తన భార్య పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భర్త ఆంజనేయులు కోరారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణ చందర్ వెంటనే ఆసుపత్రికి వచ్చారు. అసలేం జరిగిందో అక్కడి సిబ్బందిని, బాధితులను అడిగి వివరాలు తీసుకున్నారు. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.