reliance jio: వాటిని నమ్మొద్దు... యూజర్లకు జియో అలర్ట్
- రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలు
- రిలయన్స్ జియో పేరుతో ఖాతాదారులకు ఫేక్ సందేశాలు
- వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరికీ ఇవ్వొద్దని హెచ్చరిస్తున్న టెలికం సంస్థ
ప్రస్తుతం సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేటుగాళ్లు రోజుకో కొత్త తరహాతో అమాయకులకు ఎరవేస్తూ మోసాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా సైబర్ కేటుగాళ్లు రిలయన్స్ జియో పేరుతో మెసేజ్ లు పంపిస్తూ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు ఆరంభించారు. ఈ విషయం సదరు టెలికాం సంస్థ దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే తన వినియోగదారులను అప్రమత్తం చేసింది. సున్నితమైన సమాచారాన్ని అందించాలంటూ జియో పేరుతో వచ్చే మెసేజ్ లను నమ్మొద్దని కస్టమర్‌లకు తెలిపింది. ఈ క్రమంలోనే ఖాతాదారులకు పలు సూచనలు కూడా జారీ చేసింది. అవి ఏమిటంటే..
సైబర్ కేటు గాళ్లు కాల్, మెసేజ్, వాట్సప్, ఇ మెయిల్ తదితర మార్గాల ద్వారా మెసేజ్ లు పంపించవచ్చని. పాన్ కార్డు నంబర్, ఆధార్ వివరాలు, బ్యాంకు అకౌంట్ నంబర్, క్రెడిట్ కార్డ్ వివరాలు. ఓటీపీ తదితర సున్నితమైన సమాచారం అడుగుతారని, అయితే జియో పేరుతో ఇలా వ్యక్తిగత వివరాలు అడిగితే ఎటువంటి లింక్ లపైనా క్లిక్ చేయవద్దని సూచించింది. అలానే ఎస్ఎంఎస్ లకు సమాధానం కూడా ఇవ్వొద్దని తెలిపింది.
థర్డ్ పార్టీ యాప్ లు ఇన్ స్టాల్ చేసుకోవాలని కొందరు కేటు గాళ్లు సూచిస్తుంటారని, ఇలా యాప్ ల పేరుతో ఖాతాదారుల సమాచారాన్ని సేకరిస్తుంటారని, ఇటువంటి మెసేజ్ లు అందితే వెంటనే అది స్కామ్ అని తెలుసుకోవాలని చెప్పింది. ప్రధానంగా సిమ్ కార్డు వెనక ఉండే 20 డిజిట్స్ నంబర్ ను ఎవరికీ షేర్ చేయవద్దని చెప్పింది. ఎప్పటికప్పుడు ఆన్ లైన్ అకౌంట్ పాస్ వర్డ్ లు, యాప్ పిన్ లు మార్చడం మంచిదని చెప్పింది. వినియోగదారులు తమ డివైజ్ సాఫ్ట్ వేర్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుండాలని తెలిపింది.
ఖాతాదారులు తరచూ తమ బ్యాంక్ స్టేట్ మెంట్ లను చూసుకోవడం మంచి అలవాటని, ఒక్కోసారి ఖాతాదారులకు తెలియకుండానే ఏదైనా లావాదేవీ లు జరిగితే వెంటనే గుర్తించి బ్యాంక్ లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. తాము అడిగిన సమాచారం ఇవ్వకపోతే వినియోగదారుడి సేవలు నిలిచిపోతాయని సైబర్ కేటుగాళ్లు హెచ్చరిస్తుంటారని, జియో సంస్థ ఎప్పుడూ ఇలాంటివి అడగదని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎటువంటి డౌట్స్ ఉన్నా మై జియో యాప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది.