YSRCP: వైసీపీలో పలువురు నేతలకు కీలక పదవులు
- వైసీపీ అనుబంధ విభాగాలకు నూతన అధ్యక్షులను నియమించిన వైఎస్ జగన్
- రాష్ట్ర ఉపాధ్యాయ విభాగానికి అధ్యక్షులుగా ఇద్దరు ఎమ్మెల్సీలు
- సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా వంగపండు ఉష
ఏపీలో వైసీపీ బలోపేతంలో భాగంగా కీలక మార్పులు, చేర్పులకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పార్టీ అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకాలకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. దీంతో పలువురు నేతలకు కీలక పదవులు దక్కాయి.
మహిళా, రైతు, మైనార్టీ, న్యాయ, గ్రీవెన్స్ విభాగాల అధ్యక్షులుగా ఇప్పటి వరకూ ఉన్న వరుదు కల్యాణి, ఎంవీఎస్ నాగిరెడ్డి, ఖాదర్‌బాషా, మనోహర్‌రెడ్డి, నారాయణమూర్తిలను మళ్లీ కొనసాగించారు. ఇక ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతంరెడ్డికే మళ్లీ బాధ్యతలను అప్పగించారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డి, రాష్ట్ర మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్, రాష్ట్ర వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జున యాదవ్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష, రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోనమరెడ్డి సునీల్ నియమితులయ్యారు.
అలాగే రాష్ట్ర వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్ రాజు, రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఇద్దరు ఎమ్మెల్సీలు .. రామచంద్రారెడ్డి (ప్రైవేటు స్కూళ్లు), చంద్రశేఖరరెడ్డి (ప్రభుత్వ స్కూళ్లు)ని, రాష్ట్ర అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమించారు.