Nagarjuna: నాగార్జున ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేతను ప్రారంభించిన అధికారులు
- అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా
- మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించిన హైడ్రా అధికారులు
- భారీ బందోబస్తు నడుమ కూల్చివేత పనులు
అక్రమ నిర్మాణాలపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతను హైడ్రా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ శనివారం అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. తమ్మకుంటలో చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని పేర్కొంటూ, పక్కా అధారాలతో హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా హైడ్రా అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక చర్యలు చేపట్టింది. అక్రమ కట్టడాలు గుర్తించి వెంటనే కూల్చి వేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేతకు అధికారులు సిద్ధమవగా, దానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలు, ప్రముఖుల అక్రమ నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చివేతకు రంగం చేస్తుండటం హాట్ టాపిక్ అయింది.