Supreme Court: సుప్రీంకోర్టు ప్రాంగణంలో.. మహిళా లాయర్ ను కొరికిన కోతి
- కోతుల దాడిలో గాయపడ్డ న్యాయవాది సెల్వకుమారి
- తనను రక్షించేందుకు అక్కడ ఎవరూ లేరన్న బాధితురాలు
- సుప్రీంకోర్టు డిస్పెన్సరీలో మందులు కూడా లేవని విమర్శ
సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఓ మహిళా లాయర్ పై కోతులు దాడి చేశాయి. కోర్టు ఆవరణలో వున్న న్యాయవాది సెల్వకుమారిపై కోతుల గుంపు దాడి చేసింది. గుంపులోని ఒక కోతి ఆమె తొడను కొరికింది. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ, తాను కోర్టులోకి ప్రవేశించడానికి కూడా ప్రయత్నించానని... ఒక కోతి తన తొడను కొరికిందని తెలిపారు. గేటు బయట తనను రక్షించేందుకు ఎవరూ లేరని చెప్పారు. అనంతరం తాను సుప్రీంకోర్టు డిస్పెన్సరీకి వెళ్లానని, అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయని, ప్రథమ చికిత్సకు మందులు కూడా లేవని అన్నారు. కేవలం గాయాన్ని శుభ్రం చేసి వదిలేశారని, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో ఉన్న పాలీక్లినిక్ లో ఇంజెక్షన్ చేయించుకున్నారు. మరోవైపు సెల్వకుమారి సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ లో శాశ్వత సభ్యురాలు కావడం గమనార్హం.