french fries: ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వవడం లేదని భర్తపై గృహహింస కేసు పెట్టిన భార్య
- కర్ణాటక హైకోర్టులో వింత కేసు
- కాన్పు తర్వాత పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పానన్న భర్త
- భార్య ఆరోగ్యం కోసం చెబితే ఎదురు కేసు పెట్టొద్దని జడ్జి హితవు
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భార్య అనారోగ్యం పాలవకూడదని భర్త ఆంక్షలు పెట్టగా.. అపార్థం చేసుకున్న భార్య ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. భర్తపై గృహ హింస కేసు పెట్టింది. భార్య బాగుండాలని తపన పడితే ఆవిడే తనపై కేసు పెట్టడంతో సదరు భర్త లబోదిబోమన్నాడు. కోర్టులో భర్త చెప్పిన విషయం విన్నాక జడ్జి కూడా సదరు భార్యనే మందలించి కేసుపై స్టే విధించారు. కర్ణాటక హైకోర్టు ముందుకు విచారణకు వచ్చిన ఈ కేసు వివరాలు..
కర్ణాటకకు చెందిన దంపతులు ఇటీవలే తల్లిదండ్రులయ్యారు. కాన్పు తర్వాత భార్య ఆరోగ్యం విషయంలో భర్త పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. పౌష్టికాహారం తీసుకోవాలని భార్యకు సూచించాడు. అవసరమైన పదార్థాలు తీసుకొచ్చి ఇచ్చాడు. అయితే, తనకు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలని ఉందని భార్య కోరింది. బాలింతరాలు కావడంతో జంక్ ఫుడ్ వద్దని భర్త అభ్యంతరం చెప్పాడు. దీంతో మండిపడ్డ భార్య.. భర్తపై కేసు పెట్టింది.
తనను ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వడంలేదని, ఇది గృహ హింస కిందికే వస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు భర్తను స్టేషన్ కు పిలిచారు. దీంతో హైకోర్టును ఆశ్రయించిన భర్త.. తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఈ వింత కేసును విచారించిన జడ్జి.. జరిగిన సంగతి తెలుసుకున్నాక భార్యను మందలించారు. భార్య ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ తిన వద్దని చెబితే ఎదురు కేసు పెట్టడం సబబు కాదన్నారు. భర్తపై పోలీసులు నమోదు చేసిన కేసులపై స్టే విధించారు.