KL Rahul: కేఎల్ రాహుల్ దంపతుల మంచి మనసు.. వేలంలో కోహ్లీ జెర్సీకి రికార్డు ధర!
- విప్లా ఫౌండేషన్ కోసం రాహుల్ దంపతుల ‘క్రికెట్ ఫర్ కాజ్’ వేలం
- పలువురు క్రికెటర్లను సంప్రదించి ఏకం చేసిన రాహుల్, అతియాశెట్టి
- వేలంలో మొత్తం రూ. 1.93 కోట్లు సేకరణ
- కోహ్లీ జెర్సీకి రూ. 40 లక్షల ధర
- రోహిత్‌శర్మ బ్యాట్‌కు రూ. 24 లక్షలు
వెనుకబడిన తరగతుల చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్న విప్లా ఫౌండేషన్ మిషన్‌కు తనవంతు సాయం చేసేందుకు టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, ఆయన భార్య అతియాశెట్టి ముందుకొచ్చారు. ఇందులో భాగంగా ‘క్రికెట్ ఫర్ కాజ్’ పేరుతో నిన్న వేలం నిర్వహించి రూ. 1.93 కోట్లు సేకరించారు. ఈ సొమ్మును బధిరులు, మేధో వికలాంగుల కోసం విప్లా ఫౌండేషన్ ఖర్చు చేయనుంది.
ఈ వేలానికి క్రికెటర్లు తమ వంతు సాయం అందించారు. ఈ వేలంలో టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ జెర్సీ ద్వారా అత్యధిక ఆదాయం సమకూరింది. దీనికి రూ. 40 లక్షల ధర పలకగా, గ్లోవ్స్‌కు రూ. 28 లక్షలు లభించాయి. కెప్టెన్ రోహిత్‌శర్మ బ్యాట్ రూ. 24 లక్షలకు అమ్ముడుపోయింది. టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ బ్యాట్‌కు రూ. 11 లక్షలు లభించాయి. భారత దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాట్‌కు రూ. 13 లక్షలు, కేఎల్ రాహుల్ జెర్సీకి రూ. 11 లక్షలు లభించాయి.
విప్లా ఫౌండేషన్ కోసం ‘క్రికెట్ ఫర్ కాజ్’ పేరుతో వేలం నిర్వహిస్తున్నట్టు రాహుల్, అతియాశెట్టి గతవారమే ప్రకటించారు. ఇందుకోసం కోహ్లీ, ధోనీ, రాహుల్ ద్రవిడ్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్‌శర్మ, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్, చాహల్, రిషభ్‌పంత్, సంజు శాంసన్, రవీంద్ర జడేజాతోపాటు అంతర్జాతీయ ఆటగాళ్లు జోస్ బట్లర్, క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ వంటివారిని సంప్రదించారు. వారంతా తమకు ఇష్టమైన వాటిని వేలం కోసం ఇచ్చేందుకు అంగీకరించారు.