Team-Building Event: సహచర ఉద్యోగి 'ముద్దు' బెదిరింపు.. మహిళా ఉద్యోగి రాజీనామా
- వియత్నాంలో ఓ మహిళా ఉద్యోగికి చేదు అనుభవం
- టీం బిల్డింగ్ ఈవెంట్లో వికృత క్రీడ
- డ్రింకింగ్ గేమ్‌లో ముద్దు పెడతానని ఆమె తండ్రి వయసున్న ఉద్యోగి బెదిరింపు
- తీవ్రంగా కలత చెంది ఉద్యోగానికి రాజీనామా
పని ప్రదేశంలో మహిళలకు ఎదురవుతున్న వేధింపులకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. కంపెనీ టీం బిల్డింగ్ ఈవెంట్లో తనను ముద్దాడతానని తండ్రి వయసున్న ఉద్యోగి ఒకరు బెదిరించడంతో ఇంటర్న్‌షిప్ చేస్తున్న మహిళా ఉద్యోగి రాజీనామా చేశారు. వియత్నాంలో జరిగిన ఈ ఘటన మహిళ భద్రతపై మరోమారు ప్రశ్నలు లేవనెత్తింది.
‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కథనం ప్రకారం.. బాధిత మహిళ హుయన్హ్ మై గత ఏడాది కంపెనీ నిర్వహించిన ఈవెంట్లో తప్పనిసరిగా పాల్గొనాల్సి వచ్చింది. ఈ టీం బిల్డింగ్ ఈవెంట్‌కు అందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని, లేదంటే జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని, లేదా అదనపు పని గంటలకు దారితీసే అవకాశం ఉండడంతో దాని నుంచి తప్పించుకునేందుకు ఆమె పాల్గొంది.
ఈ సందర్భంగా సముద్ర తీరంలో నిర్వహించిన ఓ వికృత ఆటలో ఆమె పాల్గొనాల్సి వచ్చింది. సహోద్యోగులతో కలిసి బీచ్‌లో నీరు మోసే పోటీలో పాల్గొంది. బకెట్ల కొద్దీ నీళ్లు మోయడంతో ఆమె అలసిపోయింది. ఇక వల్లకాక ఒడ్డున కూర్చుంటే పురుష ఉద్యోగులు ఆమెను సముద్రంలోకి తోసివేశారు. దీంతో ఇదేం టీం బిల్డింగ్ అనుకుని ఆశ్చర్యపోయింది.
ఆ తర్వాత డ్రింకింగ్ గేమ్ ఆడారు. తన తండ్రి వయసున్న వ్యక్తి తాను కనీసం మూడు గ్లాసుల మద్యం తాగాలని బలవంతం చేశాడని, లేదంటే అతనికి ముద్దు పెట్టాలని బెదిరించాడని బాధిత మహిళ గుర్తు చేసుకుంది. ఈ విచిత్రమైన, వికృత ఆటలు ఏంటంటూ హుయన్హ్ విస్తుపోయింది. తర్వాత అతడు తన వద్దకు వచ్చి చేయి పట్టుకుని తాగమని బలవంతం చేశాడని గుర్తు చేసుకుంది.
‘‘అతడు నాకు దగ్గరగా వస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను మూడు గ్లాసులు తాగే వరకు అతడు ఆగి ఆ తర్వాత మరో అమ్మాయి వద్దకు వెళ్లాడు’’ అని చెప్పుకొచ్చింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల వరకు తాను కోలుకోలేకపోయానని, ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశానని గుర్తు చేసుకుంది. రాజీనామాకు ముందు ఈ విషయాన్ని సూపర్ వైజర్‌కు చెప్పినా అతడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది.