Nagarjuna: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున
- హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేసిన నాగార్జున
- హైడ్రా కూల్చివేతపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి
- తుమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లుగా ఆరోపణలు
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నాగార్జున కోరారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో, తుమ్మిడి కుంట చెరువును ఆక్రమించారనే ఆరోపణలతో హైడ్రా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నేడు కూల్చివేసింది.
మధ్యాహ్నం నాటికి నిర్మాణాలు దాదాపు పూర్తిస్థాయిలో నేలమట్టమయ్యాయి. నిర్మాణాల కూల్చివేత అనంతరం హైడ్రా యంత్రాంగం అక్కడి నుంచి వెనుదిరిగింది. కూల్చివేతలు దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగాయి. భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు జరిగాయి. ఎన్ కన్వెన్షన్ కోసం తుమ్మిడి కుంట చెరువులో మూడున్నర ఎకరాలను కబ్జా చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలను నాగార్జున కొట్టి పారేస్తున్నారు.