Narendra Modi: మోదీ, యోగిని ప్రశంసించిన ముస్లిం మహిళ... ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
- అయోధ్య అభివృద్ధిని చూసి ప్రధాని, యూపీ సీఎంపై ముస్లిం మహిళ ప్రశంసలు
- అత్త, భర్త, ఇతర కుటుంబ సభ్యులు తనను కొట్టారని పోలీసులకు ఫిర్యాదు
- భర్తతో పాటు ఎనిమిది మంది కుటుంబ సభ్యులపై కేసు నమోదు
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రేచ్కు చెందిన ఓ ముస్లిం మహిళ ప్రధాని నరేంద్రమోదీని, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించినందుకు గాను ఆమెకు భర్త "తలాక్" చెప్పాడు. అయోధ్యను అభివృద్ధి చేసినందుకు గాను ఆమె ప్రధానిని, సీఎంను ప్రశంసించింది. దీంతో తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పినట్లు ఆమె ఆరోపించింది.
ఈ నేపథ్యంలో, ఆమె తన భర్తతో పాటు, కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అత్త, భర్త, ఇతర కుటుంబ సభ్యులు తనను కొట్టారని ఆరోపించింది. తన భర్త కుటుంబ సభ్యులు తన గొంతు పిసికేందుకు ప్రయత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
మొహల్లా సరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళకు గత ఏడాది డిసెంబర్ 13న అయోధ్యలోని మొహల్లా ఢిల్లీ దర్వాజా ప్రాంతానికి చెందిన అర్షద్‌తో వివాహం జరిగింది.
పెళ్లి తర్వాత అయోధ్యలోని అత్తారింటికి చేరుకున్న సదరు మహిళకు అక్కడి రోడ్లు, సుందరీకరణ, అభివృద్ధి, వాతావరణం చాలా నచ్చాయి. దీంతో భర్త ఎదుటే ఆమె సీఎం యోగి, ప్రధాని మోదీని ప్రశంసించింది. దీంతో ఆగ్రహించిన భర్త అర్షద్ భార్యను కొట్టడంతో పాటు కాలుతున్న పాన్‌ను ఆమె పైకి విసిరాడు. భార్యను పుట్టింటికి పంపించేశాడు.
కొన్ని రోజుల తర్వాత బంధువుల జోక్యంతో ఆమె తిరిగి భర్త వద్దకు చేరుకుంది. అయితే మోదీ, యోగీని ప్రశంసించినందుకు అతడు భార్యను కొట్టడంతో పాటు ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. భర్తతో పాటు అత్తింటి వారు తనను వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అర్షద్, అతని కుటుంబ సభ్యులతో సహా 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.