Mallu Bhatti Vikramarka: నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన భట్టివిక్రమార్క
- బఫర్ జోనే కాదు... చెరువులోనే అక్రమ నిర్మాణాలు కట్టారన్న ఉపముఖ్యమంత్రి
- నోటీసులు ఇచ్చాకే నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి
- చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చూసేందుకే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడి
ప్రముఖ తెలుగు సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ కూల్చివేతలపై స్పందిస్తూ... కేవలం బఫర్ జోన్లోనే కాదని, ఏకంగా చెరువులోనే అక్రమ నిర్మాణాలు చేపట్టారన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాతే తాము అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రజల ఆస్తులను కాపాడటం ప్రభుత్వం బాధ్యత అన్నారు. తాము ఆ ప్రకారమే ముందుకు సాగుతున్నామన్నారు. అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూసేందుకే తమ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయో తెలుసుకుంటున్నామన్నారు. శాటిలైట్ ఫొటోలతో సహా ప్రజల ముందు ఉంచుతామన్నారు. అక్రమ కట్టడాలపై మాత్రం తాము నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.