Jupalli Krishna Rao: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో జూపల్లి కృష్ణారావు భేటీ
- ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి
- సెప్టెంబర్ నెలాఖరులోగా టెండర్లు పిలుస్తామని గడ్కరీ హామీ
- పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌తో భేటీ
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. సెప్టెంబర్ నెలాఖరులోగా టెండర్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న జూపల్లి పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఇందులో భాగంగా గడ్కరీని కలిశారు. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కేంద్రమంత్రితో చర్చించారు.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కూడా జూపల్లి కలిశారు. తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కావల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని, తమకు నిధులు ఇవ్వాలని కోరారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.
కేంద్రమంత్రితో భేటీ అనంతరం జూపల్లి మాట్లాడుతూ... తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఎకో, వాటర్ బాడీస్, టెంపుల్, హెల్త్ అండ్ వెల్నెస్ టూరిజంకు తెలంగాణ అనుకూలంగా ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. తెలంగాణ టూరిజానికి సహకరించాలని కేంద్రమంత్రిని కోరితే సానుకూలంగా స్పందించారన్నారు.