Ponnam Prabhakar: చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి: మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు
- చెరువుల ఆక్రమణపై స్థానికులు సమాచారం ఇవ్వాలన్న మంత్రి
- ఏ పార్టీ వారైనా, ఎంత పెద్దవారైనా ఆక్రమణలకు పాల్పడితే ఫిర్యాదు చేయాలని సూచన
- చెరువుల సంరక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్న మంత్రి
తెలంగాణవ్యాప్తంగా చెరువుల ఆక్రమణలపై సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం జంట నగరాలతో పాటు తెలంగాణవ్యాప్తంగా ఎక్కడైనా చెరువులు ఆక్రమణకు గురైనట్లు తెలిస్తే స్థానికులు... ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్నారు.
పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని... అవి ఆక్రమణకు గురైతే ఫిర్యాదు చేయాలన్నారు. ఆక్రమణలకు పాల్పడింది ఏ పార్టీ వారైనా, ఎంత పెద్దవారైనా సరే... సమాచారం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రిగా చెబుతున్నాను.. చెరువుల పరిరక్షణ కోసం అందరూ ముందుకు రావాలి అని పేర్కొన్నారు. ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎవరి మీదో కక్షపూరితంగానో లేదా ఉద్దేశపూరితంగా వ్యక్తుల మీదనో... పార్టీల మీదనో జరుగుతున్న పోరాటం కాదని, పరివర్తన కోసం తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రంలోని చెరువుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.