Chandrababu: ఇద్దరికి ఇచ్చిన మాటను 24 గంటల్లోనే నెరవేర్చిన చంద్రబాబు
- శుక్రవారం కోనసీమ జిల్లా వానపల్లిలో గ్రామసభ
- తమకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని మొరపెట్టుకున్న దివ్యాంగుడు, మరో యువకుడు
- సీఎం ఆదేశంతో 24 గంటల్లోనే స్కూటర్లు అందించిన కలెక్టర్
ఓ దివ్యాంగుడు, మరో వెనుకబడిన వర్గానికి చెందిన యువకుడికి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 24 గంటల్లోనే నెరవేర్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లిలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభకు వచ్చిన సంగంపాలేనికి చెందిన దివ్యాంగుడు ఈళ్ల భగవాన్, వాడపాలేనికి చెందిన చింతపల్లి నాగమల్లేశ్వరకిరణ్ తమకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పించాలని చంద్రబాబును వేడుకున్నారు. వాటి వల్ల తమకు జీవనోపాధి లభిస్తుందని, ఇతర పనులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని మొరపెట్టుకున్నారు.
వారి వినతికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేయాలని కలెక్టర్ ఆర్. మహేశ్కుమార్ను ఆదేశించారు. కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ఒక్కొక్కరికీ రూ. 1.5 లక్షల విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్లను కలెక్టర్ వారికి అందించారు. మొరపెట్టుకున్న 24 గంటల్లోనే తమకు స్కూటర్లు మంజూరు చేసిన చంద్రబాబుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో ఈ నెల 1న పింఛన్ల పంపిణీ సందర్భంగా తనకు ఇల్లు లేదని మొరపెట్టుకున్న వృద్ధురాలు ఓబులమ్మకు చంద్రబాబు పక్కా ఇల్లు మంజూరు చేసి మాట నిలబెట్టుకున్నారు.