Chitrapuri: చిత్రపురి కాలనీలో పలు విల్లాలకు నోటీసులు
- జీ+1 అనుమతులతో జీ+2 నిర్మాణం చేసినట్లు గుర్తింపు
- 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- లేదంటే కూల్చివేతలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు నిర్మాణాలకు కమిషనర్ నోటీసులు జారీ చేశారు. చిత్రపురి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పలు విల్లాలకు ఈ నోటీసులు ఇచ్చారు. జీ+1 నిర్మాణానికి అనుమతులు పొంది జీ+2 నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనికి 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు.
చిత్రపురి కాలనీలో జీవో 658 కి విరుద్ధంగా 225 రో హౌస్ లు కట్టినట్లు మున్సిపాలిటీ అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ విల్లాల నిర్మాణానికి జీ+1 మాత్రమే అనుమతి ఉంది. కాగా, గత పాలక వర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి సుమారు 50 కోట్ల నష్టం జరిగిందని ఫిర్యాదులు అందాయి. దీంతో అవకతవకల విషయం తేల్చేందుకు మణికొండ మున్సిపల్ కమిషనర్ తాజాగా నోటీసులు జారీ చేశారు.