Shiekh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మరో నాలుగు కేసుల నమోదు
- హసీనాపై తాజాగా మరో నాలుగు మర్డర్ కేసులు
- ఇప్పటికే ఆమెపై 53కి చేరిన కేసులు
- ఇందులో 44 హత్య కేసులు
- హసీనాపై పదుల సంఖ్యలో కేసులు పెడుతున్న బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు ఆమె మంత్రిమండలి సభ్యులు, సహాయకులపై తాజాగా మరో నాలుగు మర్డర్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం అక్కడి స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం హసీనా దేశం విడిచిపెట్టినప్పటి నుంచి ఆమెపై వరుస కేసులు బనాయిస్తోంది. ఇప్పటివరకు ఆమెపై మొత్తం 53 కేసులు నమోదయ్యాయి. వీటిలో 44 హత్యలు, ఏడు మానవత్వం, మారణహోమం, కిడ్నాప్ కేసులు ఉన్నాయి.
2010లో అప్పటి బంగ్లా రైఫిల్స్ (బీడీఆర్) అధికారి అబ్దుల్ రహీమ్ మృతిపై మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ మాజీ డైరెక్టర్ జనరల్ అజీజ్ అహ్మద్‌తో పాటు మరో 11 మందిపై ఆదివారం హత్య కేసు నమోదైంది. రహీమ్ కుమారుడు న్యాయవాది అబ్దుల్ అజీబ్ ఢాకా మేజిస్ట్రేట్ ముందు ఈ మర్డర్ కేసు దాఖలు చేశారు.
అలాగే జులై 18న చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మిలిటరీ ఇన్స్టిట్యూట్కు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో హసీనాతో పాటు మరో 48 మందిపై హత్య కేసు నమోదైంది. ట్రేడింగ్ కార్పొరేషన్ వ్యక్తి హత్యపై హసీనాతో పాటు 27 మందిపై కేసు నమోదు కాగా.. ఆటో రిక్షా డ్రైవర్ మరణం కేసుల్లో మాజీ ప్రధాని సహా 25 మందిపై హత్య కేసు నమోదైంది. ఇలా ఇప్పటివరకు షేక్ హసీనాపై మొత్తం 53 కేసులు నమోదయ్యాయి
కాగా, రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 600 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నిరసనల కారణంగానే హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్‌లో తలదాచుకుంటున్నారు.