Donald Trump: మూడో ప్రపంచ యుద్ధం తప్పేలా లేదంటూ ట్రంప్ మరోసారి హెచ్చరిక
- మధ్య ప్రాచ్యంలో పరిస్థితులను ఉటంకిస్తూ వ్యాఖ్యలు
- ఓవైపు బాంబుల వర్షం కురుస్తుంటే బైడెన్ సైలెంట్ గా ఉన్నాడంటూ ఫైర్
- అమెరికాను సంక్షోభం దిశగా నడిపిస్తున్నారంటూ కమలా హారిస్ పై ధ్వజం
మధ్య ప్రాచ్యంలో పరిస్థితులను గమనిస్తూ మూడో ప్రపంచ యుద్ధం మరెంతో దూరంలో లేదనిపిస్తోందని అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాను ప్రపంచ సంక్షోభంవైపు నడిపిస్తున్నారంటూ ప్రెసిడెంట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పై మండిపడ్డారు. మధ్య ప్రాచ్యంలో బాంబుల వర్షం కురుస్తుంటే నిద్రముఖం బైడెన్ కాలిఫోర్నియా బీచ్ లో నిద్రపోతున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరస్పరం దాడులు చేసుకుంటున్న దేశాలతో చర్చలు జరిపే ప్రయత్నం చేయకుండా కమలా హారిస్ తీరిగ్గా బస్సులో తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.
కాగా, మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటూ ట్రంప్ హెచ్చరించడం ఇది 32 వ సారి. 2013 నుంచి పలు సందర్భాలలో దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు. అయితే, తాజాగా డెమోక్రాట్ల తరఫున కమలా హారిస్ ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో పోటీపడుతుండడంతో ఆమెపై విమర్శల జోరు పెంచారు. కమల నాయకత్వంలో అమెరికాకు భవిష్యత్తు అనేదే ఉండదని తాజాగా ఆరోపించారు. తామందరినీ ఆమె అణుయుద్దం వైపు తీసుకెళుతుందని హెచ్చరించారు.