Babu Mohan: తిరిగి టీడీపీలోకి బాబుమోహన్ ?
- ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన మాజీ మంత్రి
- తెలంగాణలో టీడీపీ బలోపేతం దిశగా సీబీఎన్ చర్యలు
- పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మాజీ నటుడు బాబుమోహన్ తిరిగి సొంత గూటికి చేరే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ అరంగేట్రం చేసిన తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నట్లు సమాచారం. తాజాగా హైదరాబాద్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాబుమోహన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీలో చేరిక విషయం ప్రస్తావనకు వచ్చిందని, బాబుమోహన్ చేరిక పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాలు తెలిపాయి. బాబుమోహన్ త్వరలోనే పచ్చ జెండా కప్పుకోనున్నారని వెల్లడించాయి.
గతంలో ఎన్టీఆర్ పై అభిమానంతో బాబుమోహన్ టీడీపీలో చేరారు. 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆందోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. సాంఘిక సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత బాబుమోహన్ టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) లో చేరి 2004, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, 2018లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలోకి జంప్ అయ్యారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం బీజేపీకి గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారు.
తెలంగాణలో పార్టీ బలోపేతంపై సీబీఎన్ దృష్టి
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు సంకల్పించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ఆదివారం ఎన్టీఆర్ భవన్ లో ముఖ్య నాయకులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. బాబుమోహన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో పార్టీని వీడిన వారితో చంద్రబాబు మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీలోకి ఎంతమంది తిరిగి వస్తారనే దానిపై ఊహాగానాలు జరుగుతున్నాయి.