KV Ramana Chary: మహాట్టహాసాల సింహనాదమే ‘ఉగ్రం-వీరం’: రమణాచారి
- పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘ఉగ్రం-వీరం’ గ్రంథం
- 16సార్లు ప్రచురణకు నోచుకున్న పుస్తకం
- త్యాగరాయ గానసభలో పుస్తకాన్ని ఆవిష్కరించిన రమణాచారి
- పురాణపండ ధార్మిక సేవను కొనియాడిన వక్తలు
ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుతంగా రచించిన మహాట్టహాసాల సింహనాదమే ‘ఉగ్రం-వీరం’ దివ్య గ్రంథమని తెలంగాణ ప్రభుత్వం పూర్వ ప్రత్యేక సలహాదారు కేవీ రమణాచారి ప్రశంసించారు. ఈ పవిత్రగ్రంథం ఇప్పటి వరకు 16సార్లు ప్రచురణకు నోచుకోవడం వెనక యాదాద్రి లక్ష్మీనారసింహుని కృప ఉందని పేర్కొన్నారు. శ్రీనివాస్ రచనా పటిమ, స్వచ్ఛమైన హృదయం కూడా అందుకు మరో కారణమని కొనియాడారు.
కిమ్స్ ఆసుపత్రుల ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో నిన్న త్యాగరాయ గానసభలో ‘ఉగ్రం-వీరం’ 16వ పునర్ముద్రణను రమణాచారి ఆవిష్కరించారు. శ్రీనివాస్ విశేష సృజనాత్మక ప్రజ్ఞ కలిగిన నిస్వార్థ రచయిత అని రమణాచారి ప్రశంసలు కురిపించారు. సీనియర్ పాత్రికేయుడు శంకరనారాయణ మాట్లాడుతూ ఈ గ్రంథంలో నృసింహావిర్భావ ఘట్టం ఒళ్లు గగుర్పొడిచిందని అన్నారు. శ్రీనివాస్ అంతటి నిజమైన, నిస్వార్థ ధార్మిక సేవకుడిని తాను ఇంత వరకు చూడలేదని త్యాగరాయగాన సభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి, వంశీ ఆర్ట్ థియేటర్స్ అధినేత వంశీ రామరాజు, ఒమేగా హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ మోహన్ వంశీ, అభినందన సంస్థ అధ్యక్షురాలు భవానీ, పలువురు గాయనీగాయకులు పాల్గొన్నారు. కాగా, ‘ఉగ్రం-వీరం’గ్రంథం తొలి ప్రచురణను ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించారు.